: ముద్రగడ దీక్ష సాయంత్రంలోగా ముగియొచ్చు: టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు
కాపులకు రిజర్వేషన్లే ప్రధాన డిమాండ్ గా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి సాయంత్రంలోగా తన దీక్షను విరమించనున్నారట. ఈ మేరకు ప్రభుత్వం తరఫున నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పేర్కొన్నారు. దీక్షకు ముందుగానే టీడీపీ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వరరావులతో కలిసి బొడ్డు... ముద్రగడతో చర్చలు జరిపారు. తాజాగా నిన్న రాత్రి కూడా భాస్కరరామారావు ఒక్కరే ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ ప్రస్తావించిన అంశాలను చంద్రబాబు ముందుంచేందుకు నిన్న రాత్రే ఆయన విశాఖకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. విశాఖకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన బొడ్డు... నేటి సాయంత్రంలోగా ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలున్నాయని చెప్పారు.