: తండ్రికి పాదాభివందనం చేసిన కేటీఆర్... కుమారుడి సత్తాకు అచ్చెరువొందిన కేసీఆర్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నిన్న వెలువడిన ఫలితాలు నిజంగా సరికొత్త చరిత్రను సృష్టించాయి. మజ్లిస్ తో పొత్తు లేకుండా సొంతంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్న తొలి పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలతో పాటు మైనారిటీలు... మూడు వర్గాల ఓట్లు కీలకమైన గ్రేటర్ లో సత్తా చాటిన టీఆర్ఎస్... 150 సీట్లలో ఏకంగా 99 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇతర పార్టీలకు కంచుకోటలుగా ఉన్న డివిజన్లలోనూ ‘గులాబీ’ గుబాళించింది. ఈ మొత్తం క్రెడిట్ టీఆర్ఎస్ కీలక నేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు కల్వకుంట్ల తారకరామారావుదే. ఎందుకంటే మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకున్న ఆయన అభ్యర్థుల ఖరారులో కూడా కీలకంగా వ్యవహరించారు. దాదాపుగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అన్నీ తానై వ్యవహరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ విజయోత్సవాల్లో భాగంగా కేటీఆర్... తన తండ్రి కేసీఆర్ పాదాలకు వందనం చేశారు. అదే సమయంలో సత్తా చూపిన కొడుకు కేటీఆర్ ను... కేసీఆర్ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ దృశ్యాలను తెలుగు దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.