: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త చరిత్రకు నాంది పలికింది: కేటీఆర్
ఎన్నో ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ఎన్నికల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ శిరస్సువంచి నిండు మనసుతో ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ మాట్లాడారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని తుచ తప్పకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ గెలుపుతో టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి'గా మరోసారి రుజువైందని చెప్పారు. ఈ విజయం కోసం అహోరాత్రులు కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు సెటిలర్లని, ఇంకేవో అన్నారని, అయినా సకలవర్ణాల ప్రజలు తమకే ఓటు వేశారని కేటీఆర్ గుర్తు చేశారు.