: సర్కారు నుంచి సానుకూలత లేకే ఆందోళన... హామీ ఇస్తే దీక్ష విరమిస్తా: ముద్రగడ
తన ఆమరణ నిరాహార దీక్షకు దారి తీసిన కారణాలను కాపునేత ముద్రగడ పద్మనాభం తాజాగా విశదీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మొన్నటి ‘కాపు ఐక్య గర్జన’లో పెచ్చరిల్లిన హింసకు సంబంధించి తనపై ప్రభుత్వం 63 కేసులు నమోదు చేసిందని ముద్రగడ ఆరోపించారు. కేసులకు భయపడి తాను గృహ నిర్బంధం విధించుకున్నాననే అపవాదు రాకూడదనే భావనతోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగానని చెప్పారు. అంతేకాక కాపుల రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తే దీక్షకు దిగబోనని కూడా ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఈ క్రమంలో తనతో చర్చలకు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వరరావు, బొడ్డు భాస్కరరామారావులకు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న జస్టిస్ మంజునాథ కమిషన్ కాల పరిమితిని మూడు నెలలకు కుదించినా, తాను దీక్షకు దిగబోనని ప్రభుత్వానికి సూచించానని ఆయన తెలిపారు. తన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని నేపథ్యంలోనే గత్యంతరం లేక ఆమరణ దీక్షకు దిగినట్లు ముద్రగడ తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వం మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తే, ఇప్పటికిప్పుడు దీక్ష విరమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముద్రగడ తేల్చిచెప్పారు.