: ‘పొట్టి’ ప్రపంచ కప్ కు బరిలోకి దిగేదెవరో?...నేడే టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టు ఎంపిక
‘పొట్టి’ ఫార్మాట్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఆ దేశ గడ్డపైనే ‘వైట్ వాష్’ చేసిన టీమిండియా మంచి జోరు మీద ఉంది. సరిగ్గా టీ20 వరల్డ్ కప్ కు ముందు సన్నాహకంగా జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 3-0 తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. భారత్ వేదికగానే జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ లో పాల్గొననున్న టీమిండియా జట్టును నేడు బీసీసీఐ ఖరారు చేయనుంది. నేటి మధ్యాహ్నం భేటీ కానున్న సెలెక్షన్ కమిటీ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టును ప్రకటిస్తుంది. జట్టులో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. యువరాజ్ సింగ్ కు స్థానం దక్కుతుందా? లేదా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.