: రంగంలోకి దిగిన తోట త్రిమూర్తులు... నొప్పించక, తానొవ్వక చందాన రాయబారం


కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష దాదాపుగా రద్దయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను ముద్రగడకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఏ ఒక్కరినీ నొప్పించకుండా కార్యాన్ని చక్కబెట్టుకురావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే)ను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో నిన్న రాత్రికే రంగంలోకి దిగిన తోట... ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలతో విడివిడిగానే కాక కలివిడిగానూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాపుల రిజర్వేషన్ సున్నితమైన అంశం. 1.30 కోట్ల మంది కాపుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కాపులతో సమావేశమయ్యాం. దీక్ష యోచనను ముద్రగడ విరమించుకోవాలి. సమస్య పరిష్కారం ముఖ్యం కానీ కాల పరిమితి ముఖ్యం కాదు. ఆ దిశగా ఉద్యమ నేతలు యోచించాలి. తుని సభలో కాపులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తుని సభ ప్రభుత్వానికో, ఏ ఒక్క పార్టీకో వ్యతిరేకం కాదు. బీసీల ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అంతదాకా వేచి చూడాలి’’ అని త్రిమూర్తులు కాపులకు సూచించారు.

  • Loading...

More Telugu News