: పవన విద్యుత్తులో కొత్త ప్రయోగం... న్యూవిండ్ కృత్రిమ చెట్లతో కరెంటు ఉత్పత్తి
ఫ్రాన్సుకు చెందిన న్యూవిండ్ సంస్థ కృత్రిమ చెట్ల ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తోంది. ఇందుకోసం ప్రాథమిక నమూనాగా ఓ విండ్ ట్రీను ఫ్రాన్స్ లోని బ్రిటనీ నగరంలో ఏర్పాటు చేసింది. 26 అడుగుల ఎత్తుండే ఈ విండ్ ట్రీలు గాలి ఏ దిశ నుంచి వీస్తుందన్న దానితో సంబంధం లేకుండా... ఎటు నుంచి వీచినా ఈ చెట్లు కరెంటును ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. వాటి ఆకులే గాలిమరల్లా పనిచేస్తాయని, చిన్నపాటి గాలి వీచినా ఆకులు తిరుగుతాయని, అప్పుడు పవన విద్యుత్ ను తయారుచేసుకుంటాయని న్యూవిండ్ సంస్థ వ్యవస్థాపకుడు మిచాడ్ తెలిపారు. అసలు శబ్దమే చేయవని, చూసేందుకు అందంగా కూడా ఉంటాయని చెప్పారు. ఆ చెట్లను రోడ్డు పక్కన లేదా పార్కుల్లో ఇలా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఒక్కో విండ్ ట్రీ ధర రూ.23 లక్షలు అని చెప్పారు. వాటితో వీధి దీపాలకు ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటునే వాడుకోవచ్చని మిచాడ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ చెట్లను ప్రజలు ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు.