: పారికర్ వచ్చినా ‘డిఫెన్స్’ తీరు మారలేదు... మురిగిపోతున్న ‘రక్షణ’ నిధులు
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణ రంగం పరుగులు పెడుతుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే రక్షణ శాఖకు ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. ఆయుధ సంపత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకునేందుకు త్రివిధ దళాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్దేశించుకున్న పని ముగిసేదాకా విశ్రమించరని బీజేపీలో పేరున్న మనోహర్ పారికర్ ను గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ మోదీ ఆయనకు రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఎవరొచ్చినా తమ తీరిదేనంటూ రక్షణ శాఖ ఇంకా మొద్దు నిద్రలోనే జోగుతోంది. అందివచ్చిన నిధులను వినియోంచుకుని బలోపేతమయ్యే దిశగా రక్షణ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. అసలు విషయమేమిటంటే, ఈ ఏడాది (2015-16)కి సంబంధించి రక్షణ శాఖకు కేటాయించిన నిధుల్లో ఇప్పటిదాకా కేవలం 59 శాతం నిధులు మాత్రమే ఖర్చయ్యాయి. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో కేటాయించిన నిధులను రక్షణ శాఖ పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా ఆధునికీకరణ విభాగం కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో రక్షణ శాఖ ఎప్పటిలానే కుంటి నడక సాగిస్తోంది. నాలుగో త్రైమాసికంలో అప్పుడే ఓ నెల గడచిపోగా, ఇంకా రెండు నెలల పమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు నెలల కాల వ్యవధిలో మిగిలిపోయిన రూ.37 వేల కోట్ల నిధులను ఖర్చు చేయడం ఆ శాఖకు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.