: పాతబస్తీ ఘటనల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ, సీపీలకు గవర్నర్ పిలుపు... మధ్యాహ్నం తనను కలవాలని ఆదేశం
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఘర్షణపై గవర్నర్ నరసింహన్ కదిలినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న(బుధవారం) కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు తనను కలసి ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... ఇవాళ తనను కలవాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లను గవర్నర్ ఆదేశించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కలవాలని తెలిపినట్టు సమాచారం. వారు వచ్చిన తరువాత పాతబస్తీలో ఘటనపై ఉన్నతాధికారులతో నరసింహన్ సమీక్ష నిర్వహించి మరిన్ని వివరాలను తెలుసుకుంటారు. ఇప్పటికే ఈ సంఘటనపై పలు కేసులు నమోదుచేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.