: గూగుల్ తో పదహారేళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్న మరో చీఫ్!
దాదాపు 16 సంవత్సరాలుగా గూగుల్ లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం ఇంటర్నెట్ సెర్చ్ బిజినెస్ చీఫ్ గా ఉన్న అమిత్ సింఘాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ స్పష్టం చేసింది. ఈ నెలలోనే ఆయన తన పదవిని వీడనున్నారని, ఆయన స్థానంలో ఇంజనీరింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ జిన్నాండ్రియాను నియమిస్తున్నామని వెల్లడించింది. లారీ పేజ్, సెర్గి బ్రిన్ లు గూగుల్ ను స్థాపించిన అనంతరం రెండేళ్లకు, 2010లో అమిత్ ఆ సంస్థలో చేరారు. గూగుల్ యాడ్ వార్డ్స్ ను అభివృద్ధి చేసింది కూడా ఆయనే. ఈ నెల 26న తనకు గూగుల్ లో చివరి రోజని, ఆపై వచ్చే పదిహేనేళ్లూ పేదలకు సాయపడటంలోనే కాలం గడుపుతానని అమిత్ ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే పలువురు సీనియర్ ఉద్యోగులు దూరమైన గూగుల్ కు అమిత్ సింఘాల్ రాజీనామా గట్టి దెబ్బేనని నిపుణులు భావిస్తున్నారు. సంస్థ ఉన్నతికి కారణమైన సెర్చింజన్ అభివృద్ధి మొత్తం అమిత్ చేతుల మీదుగానే జరగడం గమనార్హం. కాగా, అమిత్ రాజీనామా ఇన్వెస్టర్లకు రుచించలేదు. దీంతో అమెరికా మార్కెట్లో గూగుల్ ఈక్విటీ విలువ 4 శాతానికి మించి పతనమై 749 డాలర్లకు పడిపోయింది.