: అవినీతికి చెక్ పడకుంటే... పన్నులు కట్టొద్దు: బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్య


‘‘అవినితికి ప్రభుత్వం చరమగీతం పాడకుంటే.. పన్నులు కట్టొద్దు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధం కండి’’... ఇదేదో ఏ స్వచ్ఛంద సంస్థో, ప్రతిపక్ష పార్టీనో చేసిన సూచన కాదు. సాక్షాత్తు రాజ్యాంగానికి రక్షణగా నిలవాల్సిన హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్య. బాంబే హైకోర్టు పరిధిలోని నాగ్ పూర్ బెంచ్ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన మాతంగ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లొక్షాహిర్ అన్నాభావు సాథే వికాస్ మహా మండలి రూ.385 కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడింది. దీనికి సంబంధించిన కేసు విచారణ నాగ్ పూర్ బెంచ్ లో కొనసాగుతోంది. ఈ కేసుపై నిన్న నాగ్ పూర్ బెంచ్ లో మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పన్నుదారులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ బాధను ప్రభుత్వాలే కాక ఆయా వర్గాల పాలక బాధ్యతలను స్వీకరిస్తున్న మండళ్లు కూడా గుర్తించాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలు రెండు దశాబ్దాలుగా అవినీతి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన పాలకులు మాత్రం అవినీతిని అంతమొందించే దిశగా దృష్టి సారించడం లేదు. అంతా ఏకమైతే అవినీతిని పారదోలవచ్చు. అవినీతి ఇంకా కొనసాగితే, ప్రజలు పన్ను కట్టొద్దు. సహాయ నిరాకణ ఉద్యమం చేపట్టాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News