: రాహుల్ ‘అనంత’ టూర్ లో ‘కోట్ల’కు అవమానం... కర్నూలు డీసీసీ కార్యాలయానికి తాళం


కర్నూలులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి (డీసీసీ) నేటి ఉదయం తాళం పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అనుచరులే ఆ కార్యాలయానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత లోతుగా ఆరా తీయగా ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. అయితే బండ్లపల్లిలో కోట్లకు తీరని అవమానం జరిగిందట. కార్యక్రమంలో కోట్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదట. దీంతో అక్కడే తీవ్ర మనస్తాపానికి గురైన కోట్ల తన అనుచరవర్గంతో కలిసి తిరిగి వచ్చేశారు. దీని ఫలితంగా నేటి ఉదయం కర్నూలులోని డీసీసీ కార్యాలయం తలుపులు తెరచుకోలేదు. రోజూ ఉదయం 9 గంటలకు తలుపులు తెరచుకునే డీసీసీ కార్యాలయం నేటి ఉదయం 11 గంటలవుతున్నా తెరచుకోలేదు. కారణమేంటని ఆరా తీయగా, అసలు కారణం వెలుగుచూసింది. కోట్ల వర్గీయులే డీసీసీ కార్యాలయం తలుపులకు తాళాలు వేసుకెళ్లినట్లుగా ప్రచారం జోరందుకుంది. దీంతో డీసీసీ పెద్దలు తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News