: దోమ కాటుతో మాత్రమే కాదు... శృంగారంతోనూ 'జికా'!
గర్భస్థ శిశువులపై పెను ప్రభావం చూపుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'జికా' వైరస్ గురించి మరో భయంకర నిజం బయటకు వచ్చింది. ఈ వైరస్ కేవలం దోమ కాటుతో మాత్రమే కాకుండా, స్త్రీ పురుషుల మధ్య జరిగే శృంగారం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డల్లాస్ కౌంటీ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తేల్చింది. ఈ మేరకు టెక్సాస్ లో 'జికా' కేసు నమోదైందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం స్పష్టం చేసింది. వెనిజులాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తితో ఉన్న లైంగిక సంబంధం కారణంగా ఈ వ్యాధి ఓ మహిళకు సోకిందని డల్లాస్ కౌంటీ ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. టెక్సాస్ కౌంటీలో 'జికా' వైరస్ దోమలు లేవని, దీంతో వైరస్ ఎక్కడిదని పరిశోధిస్తే, ఈ భయంకర వాస్తవం తెలిసిందని చెప్పారు. కాగా, 'జికా'తో ఏర్పడుతున్న ప్రమాదం గంటగంటకూ పెరుగుతుండటంతో అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే.