: ఏమన్నా, ఇక్కడ ఇంజనీర్లు లేరా?: జగన్ కు వైద్య విద్యార్థిని ప్రశ్న
శ్రీకాకుళం టౌన్ హాల్ లో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో విద్యార్థులతో జగన్ నిర్వహించిన ముఖాముఖిలో పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు. ఓ వైద్య విద్యార్థిని మాట్లాడుతూ, "అన్నా... అమరావతి నిర్మాణం అంటూ సింగపూర్ నుంచి ఇంజనీర్లను తెప్పిస్తున్నారు. ఏం ఇక్కడ ఇంజనీర్లు లేరా? ఇక్కడి వారు బలంగా నిర్మాణాలు చేపట్టలేరా? డాక్టర్లను కూడా సింగపూర్ నుంచే తెప్పిస్తారా?" అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన జగన్, అది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, ఎన్నో అద్భుత నిర్మాణాలు చేపట్టిన భారత ఇంజనీర్లపై ఆయనకు నమ్మకం లేదని, కాంట్రాక్టుల్లో నిధులు వెనకేసుకునేందుకే ఆయన సింగపూర్ మాటంటున్నారని ఆరోపించారు. మీ మాటలు వినైనా ఆయన మనసు మారాలని కోరుకుంటున్నానని, లేకుంటే మన ఖర్మగా భావించాలని అన్నారు. వైకాపా ఒక సంవత్సరంలో అధికారంలోకి వస్తుందా? రెండేళ్లలో వస్తుందా? మూడేళ్లలో వస్తుందా? అన్న విషయం చెప్పలేను గానీ, అధికారంలోకి రాగానే, అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని జగన్ అన్నారు.