: డొనాల్డ్ ట్రంప్ కు తొలి షాక్... తిరస్కరించిన అయోవా... టెడ్ క్రూజ్ గెలుపు


తదుపరి అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కు తొలి షాక్ తగిలింది. అయోవా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ప్రాంతం నుంచి రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిగా టెడ్ క్రూజ్ నిలవాలని పార్టీ డెలిగేట్స్ తీర్పిచ్చారు. కాగా, అయోవా తీర్పుతో ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రస్తుతానికి ప్రమాదం లేదని, ఆయన ఓటమితో ప్రచారం నుంచి వెనుకకు తగ్గాల్సిన పని లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్రూజ్ తన విజయంతో మరింత ధీమాగా ప్రచారంలో దూసుకెళ్లే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. అయోవా పోల్స్ లో టెడ్ క్రూజ్ గెలువగా, మార్కో రుబియో మూడవ స్థానంలో నిలిచారు. ఆయనకు, ట్రంప్ కు పెద్దగా మార్జిన్ తేడా లేకపోవడంతో రుబియో కూడా జోరుగా ప్రచారానికి దిగుతారని అంచనా. కాగా, ఈ ఎన్నికల్లో టెడ్ క్రూజ్ కు 28 శాతం ఓట్లు రాగా, డోనాల్డ్ ట్రంప్‌ కు 24 శాతం, రూబియోకు 23 శాతం ఓట్లు పడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమని భావించిన ఆ రాష్ట్రంలో ఓటర్లు టెడ్ క్రూజ్ కు జై కొట్టడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన తన ముస్లిం వ్యతిరేఖ వ్యాఖ్యలను వీడి సాధారణ ప్రచారం, అమెరికన్ల అభివృద్ధికి తాను చేపట్టే చర్యలను గురించి వివరిస్తే మేలు కలుగుతుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News