: పాక్ కు సైన్యం సమాచారాన్ని చేరవేసిన కేంద్ర ఉద్యోగులు... ముగ్గురి అరెస్ట్
పాకిస్థాన్ కు చెందిన ఓ గూఢచారికి, భారత సైన్యం గురించిన సమాచారాన్ని అందించినందుకు పోస్టల్ విభాగానికి చెందిన ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్టు రాజస్థాన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) యూఆర్ సాహూ వెల్లడించారు. స్థానిక పోలీసుల సహకారంతో బామర్, జైసల్మేర్ జిల్లాలకు చెందిన వీరిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో ఓ మహిళ కూడా ఉందని ఆయన అన్నారు. తాము అదుపులోకి తీసుకున్న ఇస్లాముద్దీన్, సీఆర్ దహియా, నరేంద్ర శర్మలను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రమీల అనే మహిళా ఉద్యోగిపై అనుమానంతో ప్రశ్నిస్తున్నామని, వీరంతా బలోతారా, పోకారన్ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఉద్యోగులని, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని పాక్ కు చేరవేశారని ఆయన తెలిపారు.