: 4 పైసలు, 3 పైసలు... తగ్గిన 'పెట్రో' ధరలు, రూ.. 82 తగ్గిన సబ్సిడీరహిత సిలిండర్ ధర
పెట్రోలు, డీజిల్ ధరలను నామమాత్రంగా తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారిన క్రూడాయిల్ ధరలను అనుసరించి పెట్రోలుపై 4 పైసలు, డీజిల్ పై 3 పైసల చొప్పున ధర తగ్గిస్తున్నామని, ఈ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇదే సమయంలో సబ్సిడీ రహిత వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 82.50 తగ్గిస్తున్నామని, విమాన ఇంధన ధర కిలో లీటరుకు 11.9 శాతం (రూ. 4,765.50) తగ్గిస్తున్నామని వెల్లడించింది. కాగా, మారిన ధరల తరువాత దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ. 59.99 నుంచి రూ. 59.95కు, డీజిల్ ధర రూ. 44.71 నుంచి రూ. 44.68కి తగ్గగా, రూ. 657.50 ఉన్న సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 575కు దిగివచ్చింది. ఇక విమాన ఇంధన ధర రూ. 35,126.82కు తగ్గగా, టికెట్ల ధరలు భారీగా పడిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 1 తరువాత పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ఇది వరుసగా మూడవ సారి. రెండు రోజుల క్రితం 'పెట్రో' ఉత్పత్తులపై కేంద్రం సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే.