: ఎన్నికల సిబ్బందిపై చేయిచేసుకున్న సీఐ... రివాల్వర్ తో హల్ చల్!
‘గ్రేటర్’ ఎన్నికల సిబ్బందిపై బాలానగర్ సీఐ బిక్షపతిరావు చేయిచేసుకున్నాడు. అంతేకాకుండా, తన సర్వీసు రివాల్వర్ బయటకు తీసి ఎన్నికల సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఎన్నికల విధుల నిమిత్తం కొంత మంది ఉద్యోగులను కుత్బుల్లాపూర్ చింతల్ ఇక్ఫాయ్ స్కూల్ కు నియమించారు. వారిలో కొంతమందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఈరోజు సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో తమకు చెల్లించాల్సిన వేతనాలను ఇవ్వాల్సిందిగా సదరు ఉద్యోగులు కోరారు. ఈ విషయమై ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య వివాదం తలెత్తింది. ఆగ్రహించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బాలానగర్ సీఐ బిక్షపతిరావు అక్కడికి వచ్చారు. ఆందోళనకు దిగిన వారిలో ముగ్గురు ఉద్యోగులను ఆయన కొట్టారు. సర్వీసు రివాల్వర్ ను బయటకు తీసి హల్ చల్ చేయడంతో.. ఉద్యోగులు వణికిపోయారు. కాగా, ఉదయం నుంచి ఆహారం లేకుండానే పని చేశామని, తమకు న్యాయంగా చెల్లించాల్సిన వేతనం విషయమై డిమాండ్ చేస్తుంటే మధ్యలో కల్పించుకున్న పోలీసుల తీరుపై ఉద్యోగులు మండిపడ్డారు.