: విజయాల పరంపర కొనసాగించడం ఇదే ప్రథమం!: సానియామీర్జా
తన క్రీడా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పాటు విజయాల పరంపర కొనసాగించడం ఇదే మొదటిసారని చెప్పవచ్చని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళ డబుల్స్ లో విజయం సాధించిన అనంతరం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ,‘టెన్నిస్ క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు ఆరు నెలల సమయంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడటం చాలా కష్టం. నా క్రీడాజీవితంలో ఇంత కాలంపాటు విజయపథంలో నడవటం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచే విజయం దిశగా దూసుకెళ్లాను. హింగిస్ తో కలిసి బాగా ఆడాను’ అని ఆమె చెప్పింది. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై సానియా సంతోషం వ్యక్తం చేసింది. కాగా, గ్రేటర్ ఎన్నికల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సానియా సూచించింది.