: నిన్ను 'క్రిమినల్' అని ఎందుకు అనకూడదు చంద్రబాబూ?: జగన్ ప్రశ్నల వర్షం
అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేస్తున్న చంద్రబాబును 'క్రిమినల్ నంబర్ 1' అని ఎందుకు అనకూడదో ఆయన స్వయంగా చెప్పాలని వైకాపా నేత జగన్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను చూపుతూ పలు ప్రశ్నలను సంధించిన ఆయన, ఏ వర్గాన్నీ ఆయన మెప్పించలేకపోయారని, ఆ కారణంగానే కాపు వర్గంలో ఫ్రస్ట్రేషన్ వచ్చిందని, దాని ప్రభావం బాబును దీర్ఘకాలం వెంటాడుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయలేదని, డ్వాక్రా రుణ మాఫీని పూర్తిగా గాలికి వదిలేశారని జగన్ ఆరోపించారు. బాబోస్తే జాబొస్తుందని, ప్రతి ఇంటికీ ఉద్యోగమిస్తానని, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతిగా రూ. 2 వేలు ఇస్తానని చెప్పిన బాబు, ఒక్కరికంటే, ఒక్కరికైనా ఇచ్చారా? అని జగన్ ప్రశ్నలపై ప్రశ్నలు సంధించారు. హామీలను నెరవేర్చకపోవడం వల్లే కాపుల్లో అసహనం పెరిగి, వారు ప్రశ్నించడం ప్రారంభించారని, అనంతపురం వెళ్లి బోయలను ఎస్టీలుగా చేస్తానని హామీ ఇచ్చాడని గుర్తుచేస్తూ, కులాల పరంగా ప్రతి విషయంలో హామీలు గుప్పిస్తూ వెళ్లి, ఇప్పుడు ఒక్క హామీనీ నెరవేర్చలేదని జగన్ దుయ్యబట్టారు. ప్రతి కులం, వర్గం, ప్రాంతాలను మోసం చేసిన చంద్రబాబును క్రిమినల్ అనడంలో తప్పేంటని అడిగారు.