: గుజరాత్... భారత్ లో భాగం కాదా?... ఆహార భద్రత చట్టం అమలుపై సుప్రీం ఘాటు వ్యాఖ్య


దేశంలో ఆకలి చావులకు అడ్డుకట్ట చెప్పడమే కాక ఆహార ధాన్యాల కొరతకు చెక్ పెట్టేందుకు పార్లమెంటు రూపొందించిన ఆహార భద్రత చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేసింది. మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయని రాష్ట్రాలు... అసలు తాము ఏమనుకుంటున్నాయో చెప్పాలని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గుజరాత్.. తాను భారత్ లో భాగం కాదని అనుకుంటుందా? అని కూడా జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆహార భద్రతా చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇదే పద్ధతి కొనసాగితే... భవిష్యత్తులో సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్లు కూడా తమకు వర్తించవని ఆయా రాష్ట్రాలు చెప్పే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార భద్రతా చట్టాన్ని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థ ‘స్వరాజ్ అభియాన్’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసిన కోర్టు, అప్పటిలోగా మరింత సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News