: లంక మాజీ అధ్యక్షుడు రాజపక్స కుమారుడి అరెస్ట్
అక్రమ నగదు లావాదేవీల్లో భాగముందన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స రెండో కుమారుడు యోషితా రాజపక్సను పోలీసులు అరెస్ట్ చేశారు. లంక నౌకాదళంలో అధికారిగా ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొలంబో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, ఆయనకు న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ ను విధించారు. కాగా, రాజపక్స మీడియా కార్యదర్శి రోహన్ వెలివిట్టను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఈ ఘటనలపై స్పందించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాజపక్స కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయ కుట్రేమీ లేదని స్పష్టం చేశారు.