: ప్లాన్ ప్రకారమే దాడులా?... గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులపైనా కాపుల దాడి!
తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారింది. ‘సమావేశాలు అవసరం లేదు, డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుదాం, పదండి’’ అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు కాపులు వేగంగా స్పందించారు. జాతీయ రహదారిపైనే కాక సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి దూసుకువచ్చిన వందలాది మంది కాపులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. తమను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. అంతటితో ఆగని కాపులు... ముందుగానే పథకం వేసుకున్నట్లుగా, గాయపడి అంబులెన్స్ లో చికిత్స పొందుతున్న పోలీసులపైనా విరుచుకుపడ్డారు. ఓ ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ చికిత్స తీసుకుంటున్న అంబులెన్స్ ను చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు దానిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వ్యాన్ లోపలికి చొచ్చుకెళ్లి పోలీసులపై దాడి చేశారు. అప్పటికే ఆందోళనకారుల దాడిలో గాయపడ్డ ఎస్పై ప్రాణాలరచేతబట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలతోనే ఆయన పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న కానిస్టేబుల్ పై కాపులు ప్రతాపం చూపారట. చంపేస్తామని బెదిరించారట. ఈ మేరకు ఈ దాడులను ప్రత్యక్ష్యంగా చూసిన అంబులెన్స్ డ్రైవర్ కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు టీవీ ఛానెల్ కు చెప్పాడు.