: రోహిత్ వేముల దళితుడే!: జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పూనియా ప్రకటన


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీసింది. సాంఘిక బహిష్కరణ చేశారన్న ఆవేదనతోనే దళిత సామాజిక వర్గానికి చెందిన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత వార్తా కథనాలు వినిపించాయి. అయితే ఆ తర్వాత రోహిత్ అసలు ఎస్సీనే కాదంటూ ఏబీవీపీకి చెందిన విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు రోహిత్ సొంతూరికి వెళ్లి విచారించారు. ఈ విచారణలో రోహిత్ వేముల వడ్డెర కులానికి చెందిన వాడని తేలింది. ఇదే విషయాన్ని నిన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో ప్రకటించారు. సుష్మా ప్రకటన వెలువడ్డ మరుక్షణమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పీఎల్ పూనియా మీడియా ముందుకు వచ్చారు. రోహిత్ వేముల ముమ్మాటికీ దళితుడేనని ఆయన ప్రకటించారు. సుష్మా స్వరాజ్ ప్రకటన సాంతం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ‘‘రోహిత్ షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ) చెందిన వాడే. రోహిత్ తో పాటు అతడి సోదరుడు, సోదరి కూడా తల్లి వద్దే పెరిగారు. ఎప్పుడో వారిని విడిచి వెళ్లిన తండ్రి కులాన్ని ఆధారం చేసుకుని రోహిత్ బీసీ అని ఎలా చెబుతారు?’’ అని పూనియా వాదించారు.

  • Loading...

More Telugu News