: కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకే ఉంది: కాపు నేతలు
కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు టీడీపీ అధినేత చంద్రబాబుకే ఉందని కాపు సమాజానికి చెందిన రాజకీయ నేతలు సి. రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో జరుగుతున్న కాపు ఐక్య గర్జన సదస్సుకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాపు సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, పుట్టుస్వామి కమిషన్ ఉండగా మరో కమిషన్ ఎందుకంటూ? వారు ప్రశ్నించారు. పుట్టుస్వామి కమిషన్ సమగ్రంగా సమర్పించిన నివేదికను పక్కన పెట్టడంలో అర్థం లేదన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాపుల పోరాటం ఆగదని రామచంద్రయ్య అన్నారు. కాగా, తుని సమీపంలోని వెలమకొత్తూరు వద్ద ఉన్న 50 ఎకరాల కొబ్బరితోటలో కాపు ఐక్య గర్జన సదస్సు జరుగుతోంది. పది చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కాపు గర్జనకు కాపు కులసంఘాలు భారీగా తరలివెళ్తున్నాయి.