: యమన్ రాజధానిపై సౌదీ బాంబుల వర్షం!
యమన్ లోని షియా రెబల్స్ లక్ష్యంగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు జరిపిన బాంబు దాడుల్లో దాదాపు 32 మంది మరణించినట్టు తెలుస్తోంది. సన్నా నగరంపై విమానాలు బాంబుల వర్షం కురిపించగా, 8 మంది పౌరులు కూడా మరణించినట్టు అధికారులు తెలిపారు. ఓ రెబల్ క్యాంపు లక్ష్యంగా బయలుదేరిన విమానాలు, ఆహారం తయారు చేసుకునే ఫ్యాక్టరీలపై కూడా దాడులు చేశాయని తెలుస్తోంది. 2014 నుంచి షియా రెబల్స్ గా పిలవబడుతున్న హౌతీలు లక్ష్యంగా సౌదీ తరచూ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. యమన్ రాజధానిలో ఈ దాడుల కారణంగా మార్చి 2015 నుంచి ఇప్పటి వరకూ 5,800 మంది మరణించగా, 80 శాతం ప్రజలకు నీరు, ఆహారం అందడం లేదని ఐరాస ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.