: నారాయణా...ఫిబ్రవరి 5న హైదరాబాదులో ఉండకు: కేసీఆర్ సలహా
'ఫిబ్రవరి 5న హైదరాబాదులో ఉండకుండా జాగ్రత్తపడు' అని సీపీఐ నేత నారాయణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా ఇచ్చారు. సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ ఎన్నికల సందర్భంగా అక్కడ హల్ చల్ చేసిన ముఠా ఇప్పుడు హైదరాబాదులో దిగిందని అన్నారు. ఈ ముఠాలో సభ్యుడు నారాయణ 'టీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు ఎన్నికల్లో విజయం సాధిస్తే చెవి కోసుకుంటా'నని అంటున్నాడని ఎద్దేవా చేశారు. వరంగల్ ఎన్నికల్లో కూడా తొడకోసుకుంటానని ఒకడు, మెడ కోసుకుంటానని ఇంకొకడు, చెవి కోసుకుంటానని మరొకడు, ముక్కు కోసుకుంటానని చెప్పినవాడొకడు...వీరందరూ వరంగల్ ఓటర్ల దెబ్బకు కనపడకుండా పోయారని ఆయన తెలిపారు. ఇప్పుడు మరోసారి నారాయణ చెవి కోసుకుంటానంటున్నాడన్న ఆయన, 'నారాయణా...ఫలితాలు వెలువడే రోజు హైదరాబాదులో ఉండకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి కోసేసే ప్రమాదం ఉంది' అని హెచ్చరించారు. దీంతో సభికుల్లో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత మళ్లీ ఆయనే చెబుతూ, 'మళ్లీ నిన్ను హైదరాబాదులోని దావఖానాలోనే జాయిన్ చేసి చికిత్స చేయాలి' అని ఆయన చమత్కరించారు.