: రజనీకి సమన్లు... విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనన్న మద్రాస్ హైకోర్టు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇటీవల కాలం ఏమాత్రం కలిసి రావట్లేదు. ‘కొచ్చాడియాన్’ చిత్రంతో మొదలైన ఇబ్బందుల పర్వం రజనీనే కాక ఆయన కుటుంబాన్ని కూడా సతమతం చేస్తోంది. తాజాగా చెన్నైలోని ‘ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్’ స్థల వివాదానికి సంబందించిన విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు నిన్న రజనీకాంత్ తో పాటు ఆయన సతీమణి లతా రజనీకాంత్ కు కూడా సమన్లు జారీ చేసింది. రజనీకాంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పాఠశాల ప్రతినిధి పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే గడువు పెంచుతామన్న కోర్టు, వ్యక్తిగత హాజరు నుంచి రజనీకాంత్ కు మినహాయింపు ఇవ్వలేనని తేల్చిచెప్పింది. దీంతో భార్యతో కలిసి రజనీకాంత్ కోర్టు మెట్లెక్కక తప్పని పరిస్థితి నెలకొంది.