: శ్రీవాస్తవ కూడా సెలవులో వెళ్లారు!... రాహుల్ రాకకు ముందు కీలక పరిణామం


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో పలు కీలక పరిణామాలకు తెర తీసింది. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, వర్సిటీ వీసీ అప్పారావులపై ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కేంద్రం మౌఖిక ఆదేశాలతో అప్పారావు నిరవధిక సెలవులో వెళ్లక తప్పలేదు. అప్పారావు స్థానంలో వర్సిటీ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ ఇన్ చార్జీ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రోహిత్ వేముల తదితరులపై సస్పెన్షన్ కు సిఫారసు చేసిన కమిటీకి నేతృత్వం వహించిన విపిన్ ను ఇన్ చార్జీ వీసీగా ఎలా నియమిస్తారంటూ విద్యార్థులతో పాటు వర్సిటీ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిన్న విపిన్ ను కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం దాకా వీసీ మార్పు విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే నిన్న అర్ధరాత్రి మొదలైన 18 గంటల మాస్ హంగర్ స్ట్రయిక్ లో పాలుపంచుకునేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారన్న విషయం నిర్ధారణ అయిన మరుక్షణమే కేంద్రం వేగంగా స్పందించింది. ఇన్ చార్జీ వీసీ విపిన్ శ్రీవాస్తవను కూడా సెలవులో పంపింది. ఈ మేరకు కేంద్రం నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న విపిన్ నాలుగు రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లారు. దీంతో ఇన్ చార్జీ వీసిగా విపిన్ తర్వాత సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ గా ఉన్న పెరియా స్వామి బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News