: కారు బొమ్మ రిమోట్ తో బోస్టన్ పేలుళ్ళు
దశాబ్దం క్రితం వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడుల అనంతరం సంభవించిన బోస్టన్ పేలుళ్ళు అమెరికాను ఉలిక్కిపడేలా చేశాయి. ఏప్రిల్ 15న ఓ మారథాన్ పరుగు సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ముగ్గురు చనిపోగా, 264 మంది గాయాలపాలయ్యారు. ఈ జంట పేలుళ్ళకు చెచెన్ జాతీయులు తామర్లేన్ సర్నయేవ్ (26), జోఖార్ సర్నయేవ్ (19) లు కారకులని అమెరికా భద్రత సంస్థలు తెలిపాయి. పేలుడు ఘటన అనంతరం గాలింపు చర్యల్లో తామర్లేన్ హతుడవగా, ఓ రోజు అనంతరం అతని సోదరుడు జోఖార్ గాయాలతో పట్టుబడ్టాడు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు.
ఓ కారు బొమ్మ రిమోట్ తో తాము బాంబు పేలుళ్ళకు పాల్పడినట్టు జోఖార్ వెల్లడించాడని అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ సోదరులిద్దరూ ఇన్ స్పైర్ అనే పత్రిక చూసి బాంబు తయారు చేసినట్టు ఆ వర్గాలు అంటున్నాయి. ఇన్ స్పైర్ పత్రికను అమెరికా-యెమెన్ జాతీయుడు అన్వర్ అల్ అవ్లాకి అనే మతగురువు ప్రారంభించాడు. అవ్లాకి అల్ ఖైదా అనుబంధ సంస్థకు నాయకుడు. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు.
కాగా, ఇన్ స్పైర్ పత్రికలో 'మీ వంటింట్లోనే బాంబు తయారు చేయడం ఎలా?' శీర్షికతో వచ్చిన కథనం చదివి ఈ చెచెన్ సోదరులు బాంబు తయారు చేశారని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. బాంబుకు అవసరమైన వస్తువులను న్యూ హాంప్ షైర్ లోని ఓ టపాకాయల దుకాణంలో కొనుగోలు చేశారని కూడా తెలిపాయి.