: గల్లీ ఫీల్డర్లను తలపించిన టీమిండియన్లు...మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఆస్ట్రేలియా ఆటగాళ్లు బౌండరీలతో విరుచుకుపడుతున్న దశలో టీమిండియా ఆటగాళ్లు గల్లీ ఫీల్డర్ల కంటే అధ్వానంగా కనిపించారు. టీమిండియా పేసర్లు ఆశిష్ నెహ్రా మూడు ఓవర్లలో 28, జస్ ప్రీత్ బుమ్రా మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చిన వేళ ధోనీ బంతిని రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు అప్పగించాడు. దీంతో రంగంలోకి దిగిన వీరిద్దరూ బంతిని వికెట్లకిరువైపులా తిప్పుతూ వైవిధ్యం ప్రదర్శించారు. అయితే, అప్పటికే ఫాంలోకి వచ్చిన షాన్ మార్ష్ (23) ఆరోన్ ఫించ్ (69) విరుచుకుపడ్డారు. బంతిని గాల్లోకి పదేపదే లేపారు. ఈ దశలో ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, హార్డిక్ పాండ్య తలా ఒక క్యాచ్ విడిచిపెట్టారు. దీంతో పించ్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. షాన్ మార్స్ స్టంప్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. అనంతరం పాండ్య క్యాచ్ తో షాన్ మార్స్ నిష్క్రమించగా, ధోనీ క్యాచ్ తో లిన్ (2) అవుటయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ (1) యువరాజ్ సింగ్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడి స్టంపౌట్ అయ్యాడు. క్రీజులో కెప్టెన్ ఫించ్ కు షేన్ వాట్సన్ (6) జత కలిశాడు. 12 ఓవర్లలో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో పాండ్య, అశ్విన్ చెరో వికెట్ తీశారు.