: ఐఫా ఉత్సవంలో కంటతడిపై ఛార్మీ వివరణ
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఐఫా ఉత్సవంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ప్రదర్శన ఇస్తుండగా అందాల నటి ఛార్మీ కౌర్ ఉన్నట్టుండి ఏడ్చేసింది. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మరో నటి శ్రియ ఆమెను ఓదార్చింది. ఆ సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, మీడియాలో పలు ఊహాగానాలతో కథనాలు వచ్చాయి. వాటిపై తాజాగా ఛార్మీ తన ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది. "ఐఫా ఉత్సవంలో నేను కంటతడి పెట్టడం వెనుక కారణం చెప్పడం చాలా ముఖ్యమని అనుకుంటున్నా. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో డీఎస్పీ తన తండ్రి (రచయిత సత్యమూర్తి)కి అంకితం చేసిన హృదయాన్ని హత్తుకునే ఆ పాటను స్టేజ్ పై ప్రదర్శన చేస్తుండగా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. ఎందుకంటే, సత్యమూర్తిగారితో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాంతో స్టేజ్ పై ఆయన పాట ప్లే చేసినప్పుడు నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. అందుకే ఇలాటి సున్నిత విషయాలను రాసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నా" అని ఛార్మీ కోరింది.