: బీహార్ లో గూండారాజ్ రీ ఎంట్రీ!... అమ్మాయిని ఎత్తుకెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
బీహార్ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమనే రూఢీ అవుతున్నాయి. నితీశ్ కుమార్ మూడో దఫా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పదేళ్ల క్రితం నాటి గూండారాజ్ తిరిగి రాష్ట్రంలోకి ఎంటరైందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను ఆ పార్టీలు పేర్కొంటున్నాయి. విపక్షాల ఆరోపణలు వాస్తవమేనని చెప్పేలా నిన్న బీహార్ లో ఓ ఘటన జరిగింది. అధికారిక కూటమిలోని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే... ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను తిరిగి ఇంటికి చేర్చారు. నిన్న ఉదయం మళ్లీ బాధిత కుటుంబం ఇంటి ముందు ప్రత్యక్షమైన సదరు ఎమ్మెల్యే బాలిక కుటుంబ సభ్యులపై దాడి చేయడమే కాక మరోమారు ఆ బాలికను ఎత్తుకెళ్లాడు. పోలీసులకు చిక్కనంత దూరం వెళ్లిపోయాడు. చిర్రెత్తుకొచ్చిన పోలీసులు ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేశారు. వివరాల్లోకెళితే... రాష్ట్రంలోని బిక్రం నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధార్థ సింగ్ ఇటీవల పాట్నాకు సమీపంలోని మసౌరీకి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. వారం క్రితం తమ కూతురును అపహరించిన సిద్ధార్థ సింగ్ నేరుగా రాష్ట్ర రాజధాని పాట్నాలో దాచారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే అయిన సిద్ధార్థ సింగ్ పై ముందుగా కేసు నమోదు చేయని పోలీసులు ఎలాగోలా ఆయనగారి ఆచూకీని కనిపెట్టి బాలికను ఆమె ఇంటి వద్ద దించారు. నిన్న ఉదయం తన అనుచరులతో కలిసి బాధితురాలి ఇంటి వద్దకు వచ్చిన సిద్ధార్థ సింగ్ ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఆ తర్వాత మరోమారు ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ సారి ఏకంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన సీఎం నితీశ్ కుమార్ పై మరింత విమర్శలకు తెర తీసేలానే ఉంది.