: రేపటి టీట్వంటీలో ఆసీస్ పుంజుకుంటుందా?...టీమిండియా పైచేయి సాధిస్తుందా?
ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా రేపు భారత జట్టు మెల్ బోర్న్ లో రెండో టీట్వంటీ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంటుందా? లేక భారత జట్టు తొలి టీట్వంటీ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టీట్వంటీల్లో తిరుగులేని జట్టుగా నిరూపించుకున్న భారత జట్టు మరోసారి మ్యాజిక్ చేస్తే సిరీస్ గెలుచుకుంటుంది. ఆసీస్ కు కోలుకునే అవకాశం ఇస్తే, సిరీస్ రసకందాయంలో పడుతుంది. సగటు భారతీయ అభిమాని దీనిని కోరుకోవడం లేదు. టీమిండియా విజయం సాధించి, వన్డేల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నాడు. కాగా, తొలి టీట్వంటీలో అన్ని రంగాల్లో తేలిపోయిన ఆస్ట్రేలియా జట్టు రెండో టీట్వంటీలో రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ రాణించడం ఆ జట్టుకు బలంగా మారింది. భారీ షాట్లకు యత్నించే క్రమంలో తొలి టీట్వంటీలో ఆసీస్ వికెట్లను కోల్పోయింది. దీంతో తొలుత నిలదొక్కుకుని తర్వాత విరుచుకుపడడమే మేలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తోంది. బౌలర్లు మరింత సమర్థవంతంగా బంతులు వేయాలని సూచించింది. పరుగులు నియంత్రించడం ప్రధానమని వారికి ఉద్బోధిస్తోంది. ఫీల్డింగ్ తప్పిదాలను పునరావృతం చేయరాదని ఆటగాళ్లకు మేనేజ్ మెంట్ సూచించింది. అదనపు పరుగులు, క్యాచ్ లు జారవిడువడం తొలి టీట్వంటీ ఓటమికి కారణాలని స్పష్టం చేసిన నిపుణులు, రెండో టీట్వంటీలో అవి జరగకూడదని సూచించారు. టీమిండియా వరుస విజయాలతో ఉత్సాహంగా కనిపిస్తోంది. చివరి వన్డే విజయం తరువాత టీట్వంటీలో సత్తాచాటడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. కొత్త ఆటగాళ్లు బుమ్రా, పాండ్య ఒత్తిడిని తట్టుకోవడం, టాప్ ఆర్డర్ సమర్థవంత ప్రదర్శనతో ఆకట్టుకోవడం టీమిండియాకు శుభసూచకంగా మారింది. తొలి టీట్వంటీ ఇచ్చిన స్పూర్తితో, ఆసీస్ ను కోలుకోనీయకుండా చేసి రెండో టీట్వంటీలో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలని ధోనీ సహచరుకులు సూచిస్తున్నాడు. త్వరలో టీట్వంటీ ప్రపంచ కప్, ఐపీఎల్ సీజన్లు ప్రారంభం కానున్నందున ఈ సిరీస్ విజయం అవసరమని ధోనీ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. రేపు జరిగే టీట్వంటీని అనధికార ఫైనల్ గా భావించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.