: చిరు 150వ సినిమాకు అడ్డంకులు...సహాయ నిరాకరణ చేస్తామని నిర్మాతకు దాసరి అల్టిమేటం
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 150వ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యాయి. తమిళనాట విజయం సాధించిన 'కత్తి' సినిమాను రీమేక్ చేయాలని చిరంజీవి భావించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగానే కత్తి సినిమా కథ తనదని, తనకు న్యాయం చేయకుండా సినీ నిర్మాణం చేపట్టవద్దని ఎన్. నరసింహారావు అనే రచయిత పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కథా రచయితల వేదిక ఛైర్మన్ దాసరి నారాయణరావును కలిశారు. దీంతో ఆ సినిమాను రీమేక్ చేయాలంటే ఈ సినిమా నిర్మాతలు రచయిత ఎన్. నరసింహారావుకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో సినిమాను రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసుకోవాలని, అది కుదరదంటే నేరుగా విడుదల చేసుకోవాలని సూచించారు. అలా కాకుండా రీమేక్ చేయాలని భావిస్తే మాత్రం 24 క్రాఫ్ట్స్ నుంచి సహాయనిరాకరణ ఎదురవుతుందని ఆయన స్పష్టం చేశారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అభిలషిస్తున్నామని దాసరి తెలిపారు. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు.