: వ్యాపారం పెంచుకునేందుకు రూ. 1000 కోట్ల రుణాలివ్వనున్న స్నాప్ డీల్
అపరిమిత భారత ఈ-కామర్స్ మార్కెట్లో మరింత వాటాను నమోదు చేసే దిశగా స్నాప్ డీల్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ ఉత్పత్తులను స్నాప్ డీల్ మాధ్యమంగా మాత్రమే విక్రయించేలా చూసేందుకు, అవసరమైన వారికి రుణాలను ఇచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల కాలంలో తమ ద్వారా ప్రొడక్టులను విక్రయించే సెల్లర్స్ కు రూ. 1000 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. రుణ గ్రహీతలను సిబిల్ రేటింగ్ ఆధారంగా నిర్ణయిస్తామని, ఔత్సాహికులకు తాకట్టు రుణాలు కూడా ఇవ్వనున్నామని సంస్థ మూలధన సహాయ విభాగం వైస్ ప్రెసిడెంట్ విజయ్ అజ్మీరా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ తమ వద్ద రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారు లేరని అన్నారు. యూఎస్, యూరప్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా రుణాలకు మంచి ఆదరణ ఉందని, ఇండియాలో వ్యాపారులకు, ఉత్పత్తుల తయారీదార్లకు రుణ సదుపాయం ఈ రూపంలో దగ్గరకావడం ఇదే మొదటిసారని తెలిపారు. ఆన్ లైన్ సెల్లర్స్ కు మరిన్ని రుణాలు ఇప్పించేందుకు పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. తామిచ్చే రుణాలపై 2 నుంచి 3 శాతం మాత్రమే వడ్డీ ఉంటుందని, ఇప్పటివరకూ రూ. 300 కోట్ల రుణాలిచ్చామని తెలిపారు. ఇవి రూ. 30 వేల కనీస మొత్తం నుంచి ప్రారంభమవుతాయని, అవసరాలకు తగ్గట్టుగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తామని అన్నారు.