: అదృష్టాన్నిచ్చే దేవతా బొమ్మలు వచ్చాయ్ ... విమానాల్లో వీటికి నైవేద్యం కూడా పెడుతున్నారు!


ప్రపంచవ్యాప్తంగా కొత్త ట్రెండ్ మొదలైంది. అదే 'ఏంజల్ డాల్స్'... థాయ్ ల్యాండ్ లో మొదలైన ఈ దేవతా బొమ్మల శకం శరవేగంగా విస్తరిస్తోంది. ఇవి ఎలాంటివో తెలుసా... చిన్నారుల మాదిరిగా కనిపించే బొమ్మలు. వీటిని దగ్గరుంచుకుంటే అదృష్టం గట్టిగా పట్టుకుంటుందట. థాయ్ ల్యాండ్ లో పలువురు సెలబ్రిటీలు, తామీ బొమ్మలను కొనుగోలు చేసిన తరువాత, వృత్తిలో విజయం సాధించామని చెబుతుండటంతో ఈ 'బొమ్మల మేనియా' పెరిగిపోయింది. ఈ బొమ్మలు ప్రాణాలతో ఉన్నవేనని, వీటితో తమకు కలిసొస్తుందని నమ్మే వారి సంఖ్య లక్షల నుంచి కోట్లల్లోకి చేరింది. ఇక ఇప్పుడీ 'ప్రాణమున్న' బొమ్మలకు పూర్తి సేవలను అందించాలని థాయ్ ఎయిర్ వేస్ నిర్ణయించిందని తెలుస్తోంది. విమానాల్లో వీటికోసం సీట్లు, నైవేద్యాలను సిద్ధం చేసి ప్రయాణికుల మనోభావాలను గౌరవించాలని భావిస్తోంది. ఈ బొమ్మల కోసం ఆహారం, డ్రింక్స్ సిద్ధం చేస్తోందని వార్తా సంస్థ ఏఎఫ్పీ (అసోసియేటెడ్ ఫ్రాన్స్ ప్రెస్సీ) ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీటికి విమాన ప్రయాణం మధ్యలో రిఫ్రెష్ మెంట్స్ అందిస్తున్నారని తెలిపింది. ఈ బొమ్మల కోసం టికెట్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదట మరి. ఇక బస్సులు, రైళ్లలో ఈ దేవతా చిన్నారి బొమ్మలకు హాఫ్ టికెట్లు వసూలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ బొమ్మలు విదేశాల నుంచి థాయ్ ల్యాండ్ కు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఒక్కో బొమ్మ ఖరీదు 600 డాలర్ల (దాదాపు రూ. 40 వేలు) వరకూ ఉంటుండగా, వీటి దిగుమతిలో పెద్ద ఎత్తున పన్నులు ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలపై థాయ్ ప్రభుత్వం పెద్దఎత్తున దాడులు చేస్తోంది.

  • Loading...

More Telugu News