: మందెక్కువైతే, జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతారు!
ఏదైనా స్టార్ హోటల్లో లేదా బార్ లో కూర్చుని పూటుగా తాగితే, మీరు జాగ్రత్తగా వాహనాన్ని నడపలేరని భావిస్తే, మీ కోసం ఓ డ్రైవర్ అందుబాటులో ఉంటాడు. అతను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతాడు. రాష్ట్రాలకు మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా ఉన్న నేపథ్యంలో, దాని నియంత్రణ పక్కన పెట్టిన తెలంగాణ సర్కారు, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కంకణం కట్టుకుంది. బార్లు, స్టార్ హోటళ్ల యాజమాన్యాలతో ఎక్సైజ్ శాఖ అధికారుల సమావేశంలో ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇకపై టేబుళ్లపై మద్యం తాగి వాహనాలు నడపరాదన్న స్లోగన్లున్న మినీ బోర్డులు, బ్యానర్లు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఎవరైనా అతిగా మద్యం తీసుకుంటే, బ్రీత్ ఎనలైజర్ పరీక్ష జరిపి వారి కోసం డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని, ఆ బాధ్యతంతా హోటళ్లు, బార్ల మేనేజ్ మెంటుదేనని తేల్చి చెప్పారు. ఇక నడిచి కూడా పోలేని పరిస్థితుల్లో ఉంటే టాక్సీలను ఏర్పాటు చేసైనా వారిని క్షేమంగా ఇల్లు చేర్చాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.