: ఆర్టీయే కొత్త యాప్... ఇక సెల్ ఫోనే డ్రైవింగ్ లైసెన్స్!
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ వంటి వాహన దస్త్రాలను వెంట తీసుకువెళ్లడం మరచిపోయినా, పోలీసుల జరిమానా ఉండదు. అయితే, మీ వెంట సెల్ ఫోన్, అందులో ఆర్టీయే విడుదల చేయనున్న యాప్ ఉండాలి మరి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోగలిగిన ఈ యాప్ లో వాహన బీమా తరహాలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటివి ఉంటాయి. అంతకుముందే ఈ యాప్ వాడుతూ, ఈ-లైసెన్స్, ఈ-ఆర్సీ, ఈ-బీమా, ఈ-కాలుష్యం వంటి డాక్యుమెంట్లను పొందాల్సివుంటుంది. పర్మిట్లు కూడా ఇదే యాప్ ద్వారా పొందవచ్చని, తెలంగాణలోని సమస్త వాహన సమాచారంతో కేంద్ర సర్వర్ ను టీఎస్టీడీ యాప్ తో అనుసంధానం చేశామని అధికారులు వివరించారు. ఆర్టీయే కార్యాలయానికి రానవసరం లేకుండానే, ఆన్ లైన్లో ఫీజులు చెల్లించి అన్ని రకాల సేవలను అందుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ యాప్ అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.