: ఆ నలుగురు ఇరాకీలు ఉగ్రవాదులని అనుమానం: ఒడిశా పోలీస్
ఇరాక్ పౌరులమని చెప్పిన నలుగురు వ్యక్తులను తమ పాస్ పోర్టు లు చూపించమని అడగగానే వారు పారిపోయిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భువనేశ్వర్ లోని ఆర్య మహల్ హోటల్ కు నిన్న రాత్రి నలుగురు వ్యక్తులు వెళ్లారు. సుమారు 6.5 అడుగుల ఎత్తు ఉన్న ఈ నలుగురు తమకు రెండు గదులు కావాలని కోరారు. తాము ఇరాక్ కు చెందిన వారమని వారు చెప్పారు. పాస్ పోర్టులు చూపించమని హోటల్ సిబ్బంది కోరగానే వారు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. తప్పుడు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న కారులో వారు ఇక్కడికి వచ్చారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో వారు మాట్లాడుతున్నారు. ఈ సమాచారం తెలసుకున్న తాము హోటల్ వద్దకు వెళ్లే సరికే నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారని డీజీపీ కేబి సింగ్ పేర్కొన్నారు. నలుగురిలో ఒకడు హోటల్ రూమ్ కోసం వచ్చాడని, మిగిలిన ముగ్గురు కారు వద్దే ఉన్నారని హోటల్ మేనేజర్ సిబా నారాయణ్ మహాపాత్ర చెప్పారు. తన వద్దకు వచ్చిన వ్యక్తితో బాటు, వారు ఉపయోగించిన కారు సీసీటీవీలో రికార్డు అయిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు సేకరించారు. కాగా, ఈ నలుగురు వ్యక్తులు ఉగ్రవాదులని తాము భావిస్తున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్పీ శర్మ అన్నారు. దీంతో, ఒడిశా రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.