: ఆసీస్ నడ్డి విరిచిన జడేజా, అశ్విన్, బుమ్రా...ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 33 బంతులెదుర్కొన్న ఫించ్ 133.33 స్ట్రయిక్ రేట్ తో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఫించ్ ను పెవిలియన్ బాటపట్టించేందుకు ధోనీ, నెహ్రా, అశ్విన్, బుమ్రా, హార్డిక్ పాండ్య, జడేజాలను రంగంలోకి దించాడు. అందర్నీ ఓ ఆటాడుకున్న ఫించ్, అశ్విన్ రెండో విడత బౌలింగ్ కు దిగి, అద్భుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఫించ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. జడేజా విసిరిన బంతిని స్వీప్ షాట్ కొడదామని ప్రయత్నించిన హెడ్ (2) దానిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న స్మిత్ (21)ను కోహ్లీ క్యాచ్ తో జడేజా పెవిలియన్ కు పంపాడు. అనంతరం అద్భుతమైన బంతితో అశ్విన్ షేన్ వాట్సన్ (12) పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఆసీస్ 14 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో రెండు వికెట్లతో రాణించగా, బుమ్రా ఒక వికెట్ తీసి సత్తాచాటాడు. క్రీజులో లిన్ (7) ఉన్నాడు.