: ‘తెలంగాణ’ ఇచ్చినట్టుగానే మాకూ ఇవ్వండి: మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరంలోని ట్రాఫిక్ పోలీసులు కాలుష్యపు గాలిని పీల్చుకుని అనారోగ్యం పాలవుతున్నారు. తమ డ్యూటీలో భాగంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తుంది. దీంతో వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ తో పాటు మొదలైన వాయు కాలుష్యాలతో పాటు ధ్వని కాలుష్యం బారిన కూడా పడుతున్నామని ముంబయి ట్రాఫిక్ పోలీసులు వాపోతున్నారు. దీంతో తమకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు రావడంతో బాటు, వినికిడి సమస్యకు, ఒత్తిడికి గురవడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ హజర్డ్ అదనపు అలవెన్స్ తో పాటు తమ వేతనాలను 30 శాతం వరకు పెంచాలని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను ఆధారంగా చేసుకుని ముంబయి ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వేతనాలను పెంచాలని ప్రతిపాదించారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి సంఖ్య పద్ధతి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ముంబయి లో కూడా ఒక కొత్త పద్ధతిని అవలంబించేందుకు సిటీ ట్రాఫిక్ విభాగం పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.