: చెడు ఇరుగుపొరుగు మధ్య ఉత్తమ నివాసంగా భారత్: మోర్గాన్ స్టాన్లీ
ఇరుగు పొరుగున చెడ్డవారున్నప్పటికీ, ఇండియా ఉత్తమ నివాసమేనని ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన మే, 2014 తరువాత, దలాల్ స్ట్రీట్ లో సెన్సెక్స్ సూచిక తొలిసారిగా 24 వేల దిగువకు రావడంపై మోర్గాన్ స్టాన్లీ స్పందించింది. ఇండియాలో వృద్ధి రేటు గత 12 నెలలుగా మందగించినప్పటికీ, ప్రధానంగా అంతర్జాతీయ వాతావరణమే కారణమని పేర్కొంది. చైనాలో మాంద్యం, క్రూడాయిల్ ధరల పతనం తదితరాలు భారత్ పై ఉన్నాయని వెల్లడించింది. ప్రధాని మోదీ నాలుగు విభాగాల్లో శ్రద్ధ చూపాలని సలహా ఇస్తూ, తొలుత ద్రవ్య లోటును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించాలని, పెట్టుబడులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, పారదర్శకత పెరగాలని సూచించింది. ఎగుమతులు దిగజారుతుండటం, ద్రవ్యోల్బణం భారత్ ముందున్న పెను సవాళ్లని మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధి రిధమ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఆశాజనకంగా కనిపిస్తున్నందున, పెట్టుబడుల అవకాశాలను వదులుకోరాదని సలహా ఇచ్చారు.