: భద్రతా బలగాల చక్రబంధంలో ఢిల్లీ... గణతంత్ర వేడుకల నేపథ్యంలో భారీ భద్రత
భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా బలగాల చక్రబంధంలోకి వెళ్లిపోయింది. కేంద్ర పారా మిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా భారీ సంఖ్యలో మోహరించారు. మొత్తం 80 వేల మంది పోలీసులు నగరంలో భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జరగనున్న పరేడ్ లో ఫ్రాన్స్ సైన్యం కూడా పాలుపంచుకుంటోంది. ఢిల్లీలోని రాజ్ పథ్ లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న వేడుకలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. సుశిక్షితులైన సైనికులతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా వేడుకలపై నిఘా పెట్టాయి.