: రైతుల ఆందోళనలతో దిగొచ్చిన బాబు సర్కారు... రాజధాని మాస్టర్ ప్లాన్ కు మార్పులు!
కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ (సీఆర్డీఏ) ముందున్న అమరావతి మాస్టర్ ప్లాన్ పట్ల రైతులు వ్యక్తం చేసిన నిరసనతో చంద్రబాబు సర్కారు దిగొచ్చింది. గ్రామ కంటాలు, ఊర్లలో రహదారుల విస్తరణ, సీడ్ క్యాపిటల్ లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయాలు తదితరాలపై రైతుల ప్రశ్నలకు సమాధానాల కోసం పురపాలక శాఖా మంత్రి పి నారాయణ ఆగమేఘాల మీద సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట సీఆర్డీయే కమిషనర్ శ్రీకాంత్ కూడా వెళ్లారు. వీరిద్దరూ కలిసి అక్కడి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ లో తమకున్న సందేహాలు, మార్పులు చేర్పులపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, రాజధాని ప్రాంతంలో నిర్మించతలపెట్టిన ఎక్స్ ప్రెస్ హైవేలు, వ్యవసాయ జోన్లను వ్యతిరేకిస్తూ, రైతుల నిరసనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సొంత గ్రామాల్లో భూములు దక్కవని భావిస్తున్న వారు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారి ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.