: మానవత్వానికి వెలకట్టే మెషీన్ మా వద్ద లేదు!...వీధి బాలల కడుపు నింపిన యువకుడికి కేరళ హోటల్ సెల్యూట్!
నిజమేగా... మానవత్వానికి వెల కట్టే మిషన్ ను ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. ఈ విషయం అందరికీ తెలిసినా, హోటల్ సబ్రినాకు తెలిసినంతగా తెలియదు. ఎందుకంటే, ఆ హోటల్ ఇటీవల ఓ యువకుడికి అరుదైన బిల్లును ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ హోటల్ సబ్రినా ఎక్కడుంది?... ఏంటా కథ... దాని గురించి తెలుసుకుందాం. కేరళలోని మలప్పురంలో సి.నారాయణన్ అనే వ్యక్తి ‘హోటల్ సబ్రినా’ పేరిట ఓ భోజనశాలను నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ కు ఈ నెల ప్రథమార్ధంలో ఓ యువకుడు మధ్యాహ్న భోజనానికి వచ్చాడు. శుభ్రంగా చేతులు కడుక్కుని ఓ టేబుల్ ముందు కూర్చుని భోజనం ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా ఆర్డర్ చేసిన ఆహారం టేబుల్ మీదకు రాలేదు. పక్కనున్న అద్దాల్లోంచి అటుగా బయటకు చూసిన అతడికి హోటల్ లోని ఆహారం వైపు ఆకలిగా చూస్తున్న రెండు కళ్లు కనపడ్డాయి. వెంటనే అతడిలోని మానవత్వం యాక్టివేట్ అయ్యింది. లోపలకు రమ్మన్న అతడి సైగలు గమినించిన ఆ రెండు కళ్లు మరో రెండు చిన్నారి కళ్లను వెంటబెట్టుకుని లోపలకు వచ్చాయి. ఆ కళ్లెవరివంటే... ఆకలితో నకనకలాడుతున్న ఓ వీధి బాలుడు, అతడి చిన్నారి చెల్లివి. వారిద్దరిని తన టేబుల్ వద్ద కూర్చోబెట్టుకున్న యువకుడు వారికి భోజనం పెట్టించాడు. కడుపు నింపుకున్న ఆ ఇద్దరు చిన్నారులు ఆ యువకుడికి కృతజ్ఞతలు చెప్పకున్నా, కళ్లతోనే ధ్యాంక్స్ చెప్పేసి వెళ్లిపోయారు. వారిద్దరి కడుపు నింపిన యువకుడి కడుపు నిండిపోయింది. బిల్లు తెమ్మని హోటల్ సిబ్బందికి చెప్పాడు. హోటల్ సర్వర్ కూడా బిల్లు తెచ్చిచ్చాడు. ఆ బిల్లును చూసిన యువకుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. అయినా అందులో ఏముందంటే... కట్టాల్సిన బిల్లు మొత్తం లేదు. ఆంగ్లంలో రాసిన రెండు వాక్యాలున్నాయి. ‘‘వియ్ డోన్ట్ హ్యావ్ ఏ మెషీన్ దట్ క్యాన్ బిల్ హ్యూమానిటీ. మె గుడ్ హ్యాపెన్ టు యూ.(మానవత్వాన్ని కొలిచే మెషీన్ మా వద్ద లేదు. మీకంతా మంచే జరగాలి)’’ అన్న ఆ పదాలను చూసి ఆ యువకుడు భోజనం చేయకుండానే కడుపు నిండిపోయిన స్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పేరు కూడా చెప్పకుండానే అతడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ప్రస్తుతం ఈ మొత్తం ఘటనను కళ్లకు కడుతూ ‘రూట్ థింకర్స్’ పేరిట ఓపెన్ అయిన ఓ ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ నెల 6న ఓ స్టోరీ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ ను నెటిజన్లు షేర్ల మీద షేర్ చేస్తున్నారు. లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. అయితే సదరు పోస్టింగ్ మొత్తం కూడా కేరళ స్థానిక భాష మలయాళంలో ఉంది.