: 25 సంవత్సరాల నాటి ఆదేశాలు తలచుకుని చింతిస్తున్న ములాయం!


దాదాపు 25 సంవత్సరాల క్రితం... అంటే 1990లో అయోధ్యలో కరసేవకులపై కాల్పులకు ఆదేశించడం పట్ల ఎంతగానో చింతిస్తున్నానని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో మతసామరస్యం, అయోధ్యను కాపాడుకునేందుకు అలా చేయక తప్పలేదని అన్నారు. 1990లో యూపీ ముఖ్యమంత్రిగా ములాయం ఉన్న వేళ, కరసేవకులు అయోధ్యపై దాడి చేసి బాబ్రీ మసీదును కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. "కరసేవకులపై కాల్పులకు ఆదేశించిన తరువాత నేనెంతో బాధపడ్డాను. కానీ, ఓ మతానికి చెందిన ప్రాంతాన్ని కాపాడేందుకు నాకు మరో మార్గం లేకపోయింది" అని ములాయం వ్యాఖ్యానించారు. సామ్యవాద నాయకుడు కర్పూరీ ఠాకూర్ జయంతి ఉత్సవాల సందర్భంగా, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ములాయం ప్రసంగించారు. అప్పట్లో పార్లమెంటులో విపక్ష నేతగా ఉన్న వాజ్ పేయి, ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసుకున్నారు. తాను కాల్పులకు ఆదేశించకుంటే మరిన్ని ప్రాణాలు పోయుండేవని అన్నారు. యూపీలో కొందరు మంత్రులు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, వారు డబ్బు సంపాదించడం కోసమే పనిచేస్తున్నట్లయితే, రాజకీయాలు వదిలి వ్యాపారాలు చేసుకోవాలని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News