: ఇక ఆన్ లైన్ లోనూ గ్యాస్ సిలిండర్ డబ్బులు
ఎల్పీజీ సిలిండర్ ను బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులు కూడా చెల్లించే సదుపాయం దగ్గరైంది. ఇప్పటివరకూ ఆన్ లైన్ బుకింగ్ లకు మాత్రమే అవకాశం ఉండగా, సిలిండర్ ఇంటికి వచ్చిన తరువాత మాత్రమే డెలివరీ చేసిన వారికి డబ్బులు చెల్లించాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఇకపై ఆన్ లైన్లో బుక్ చేసుకునే సమయంలోనే డబ్బులు కూడా చెల్లించవచ్చు. 'www.mylpg.in' వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చని, ఈ సేవలను 13 భాషల్లో పొందవచ్చని పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇదే సమయంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో టచ్ స్క్రీన్స్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకుని, డబ్బులు అక్కడికక్కడే చెల్లించేలా పాయింట్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకునేవారు చెల్లించాల్సిన రూ. 3,400ను గరిష్ఠంగా 24 వాయిదాల్లో చెల్లించే సౌలభ్యంపై చమురు సంస్థలు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు.