: సెంట్రల్ వర్సిటీలో హైటెన్షన్... ‘చలో హెచ్ సీయూ’కు తరలివస్తున్న వేలాది మంది విద్యార్థులు


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడుకుతున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేడు మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ‘చలో హెచ్ సీయూ’ పేరిట వర్సిటీ విద్యార్థుల జేఏసీ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించినట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు హైదరాబాదు చేరుకున్నట్లు సమాచారం. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ వీసీ అప్పారావును తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు, రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ కోసం లేఖలు రాసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని విద్యార్థి జేఏసీ కోరుతోంది. ఇక రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ కు సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షత వహించిన విపిన్ శ్రీవాస్తవను ఇన్ చార్జీ వీసీగా అంగీకరించేది లేదని కూడా విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. ఈ డిమాండ్లన్నింటిని నెరవేర్చేదాకా తమ ఆందోళనను విరమించేది లేదని కూడా జేఏసీ తేల్చిచెప్పింది. నేటి ‘చలో హెచ్ సీయూ’లో విద్యార్థులతో పాటు పలువురు రచయితలు, ప్రజా సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాలుపంచుకునే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News