: ఆ నేరస్తుడిని 1000 సీసీ కెమెరాలు కనిపెడుతుంటాయి!
ఆ నేరస్తుడు జైలు నుంచి తప్పించుకుని పారిపోకుండా ఉండేందుకు 1000 సీసీ కెమెరాలు అతన్ని కనిపెడుతుంటాయి. ఇంత పెద్ద నేరగాడెవరా? అనేగా మీ సందేహం! ఆయనే మెక్సికోలో మాదక ద్రవ్యాల అండర్ వరల్డ్ డాన్ ఎల్ చాపఓ గుజ్ మెన్! రెండేళ్ల క్రితం మెక్సికోలోని అల్టిప్లానో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. టాయిలెట్ నుంచి కిందకు సొరంగం తవ్వి.. సుమారు ఒక మైలు దూరం అండర్ గ్రౌండ్ డ్రైనీజీలో ప్రయాణించి మరీ పారిపోయాడు. ఎట్టకేలకు గుజ్ మెన్ ను పోలీసులు పట్టుకుని మళ్లీ అదే జైలుకి తరలించారు. అయితే, ఈసారి కట్టుదిట్టమైన భద్రత మధ్య గుజ్ మెన్ ను సెల్ లో ఉంచారు. గుజ్ మెన్ జైలు నుంచి పారిపోకుండా ఏ స్థాయిలో భద్రత ఉందంటే.. ఇనుపరాడ్లతో నిర్మించిన జైలు గది, ఆ గదిని పర్యవేక్షించేందుకు 1000 సీసీ కెమెరాలు, వందలాది ప్రత్యేక భద్రతా సిబ్బంది, వారు ధరించే హెల్మెట్లకు ప్రత్యేక కెమెరాలు, ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలు, గుజ్ మెన్ ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు వేరే వ్యక్తులకు అనుమతించక పోవడం వంటి పలు జాగ్రత్తలు జైలు అధికారులు తీసుకున్నారు. కాగా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ గుజ్ మెన్ ను తప్పిస్తామని ఆ ముఠా సభ్యులు ప్రకటించడం గమనార్హం.